Cultural, Literature

Bnim – To.Le.Pi.

“ బ్నిం ” —

ఇదేమిటి – ఈ ‘ ఏకాక్షరం ‘ పేరేమిటి అని ఊరికే తెగ హాశ్చర్యపోకండి సుమీ !….. 

అదేనండీ బాబూ – ఆయన పేరు బ్నిం — అర్ధం కాలేదా… …

– అసలు పేరు భమిడిపల్లి నరసింహమూర్తి ( ట ) – అలా అని ఆయన ఒప్పేసుకున్నా గానీ – ఇంటా, బయటా అందరూ ఆయనని ప్రేమగా, ముద్దుగా, కామన్ గా ( బొట్టు పెట్టకపోయినా ) పిలిచే పేరు బ్నిం అని – అదే అసలు సిసలైన పేరు గా చెలామణి అయిపోతోంది ఇన్నాళ్లు — ఇన్నేళ్లు… ఇక ముందూ అంతే మరి !

సరే — ఆయన బయోగ్రఫీ వివరాలు కొన్ని సంక్షిప్తం గా ~

రాబోయే పెద్దరికానికి బాట వేసే చిన్నరికం ( చిన్నతనం – బాల్యం ) లో బ్నిం బడికి వెళ్లలేదనటం – అయినా అదేమీ లోటుగా అనిపించింది కాదు – అందుక్కారణం ఆయన తండ్రి గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు అయిన శ్రీ సూర్యనారాయణ గారి ఆయుర్వేద శిక్షణ లో సుశిక్షితుడై – ఆయన అందించిన వెలుగులతో రాణించాడు – మరో ఆయుర్వేద వైద్యునిగా ఆ వెలుగుల వెచ్చదనాన్ని పంచుకున్నారు. ఇక బ్నిం తాతగారు ( మాతామహులు) అయిన శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు గొప్ప పండితులు. వారి కుమార్తె, బ్నిం తల్లిగారు అయిన శ్రీమతి విజయలక్ష్మి గారు సంసృత, తెలుగు భాషాకోవిదురాలు – అనన్య సాహితీ పరిణతిని ఆర్జించిన ఉత్తమ ఇల్లాలు – విజయలక్ష్మి గారి గురించి వారి పాండిత్య గరిమ గురించిన నేను విన్న ఒక విషయం — శ్రీయుతులు బాపు – రమణలు ఈటీవి వారికి శ్రీభాగవతం ని చిత్రీకరణ చేస్తున్న రోజులలో – పౌరాణికపరమైన ఏ సందేహం వచ్చినా – దానిని వెంటనే నివృత్తి చేసుకోవడం కోసం విజయలక్ష్మి గారిని సంప్రదించేవారని – అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే వారి ఇతిహాస, పురాణ శాస్త్ర జ్ఞానం అంత ఉన్నతస్థాయి కి చెందినది అన్నమాట !

బ్నిం సాహితీ వ్యవసాయం గురించి చెప్పాలంటే.. ఎంతో ఉంది… దీనిని గురించి ఎంత చెప్పినా… ఎంతసేపు చెప్పినా అది తరగనిది — ఏమంటే ఆయన నిత్య కృషీవలుడు. సాహితీ వ్యవసాయాన్ని సుసంపన్నం చేస్తూ అందులో బంగారు పంటలను పండించే పుణ్యమూర్తి ఆయన – ఆయన ఒక కధారచయిత, పద్యకారుడు, చిత్రకారుడు, టి. వి. లో మాటల రచయిత — ఇదే రంగం లో నాలుగుసార్లు నంది పురస్కారాలను అందుకున్న ప్రముఖుడు – ఇవన్నీ ఒక ఎత్తు అయితే — అధిక సంఖ్య లో — అంటే దాదాపుగా 215 కూచిపూడి నృత్య రూపకాలకు రూపు దిద్ది తన మాటలతో ప్రాణం పోసిన శిల్పి ఆయన… అది మరో ఎత్తు…

బ్నిం కీ నాకు తొలి పరిచయము ఏర్పడిన సంఘటన చాలా చిత్రమయినది గా చెప్పవచ్చును. ఆప్తులు, ప్రముఖ చిత్రకారులు, వ్యంగ్య చిత్రకారులు, చలనచిత్ర దర్శకులు శ్రీ బాపు గారికి ఒకసారి నేను లండన్ నుండి వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించి 3 గంటల నిడివి లో ఉన్న FANTASIA వీడియో క్యాసెట్ ని కొని తెచ్చి చిరు కానుక గా పంపాను – దానిని అందుకుని బాపు గారు ఎంతో ఆనందపడుతూ క్యాసెట్ అందిన తక్షణం నాకు ఉత్తరం వ్రాసారు – నా నుండి ఈ విషయం విన్న బ్నిం, వీలయితే ఇంకొకసారి తనకీ ఒక క్యాసెట్ తెచ్చిపెట్టవలసినది గా నన్ను కోరడం జరిగింది. నా తదుపరి UK ట్రిప్ లో అక్కడ నుండి ఆ క్యాసెట్ తెచ్చి బ్నిం కి పంపాను – దానికి స్పందిస్తూ ఆయన నాకు బోణీ గా వ్రాసిన తొలి ఉత్తరం… ఇదిగో… ఈనాటి తోక లేని పిట్ట !

అటు తరువాత తనూ, నేనూ 2 – 3 పర్యాయాలు కలవడం – కలిసి కలబోత గా కబుర్లు చెప్పుకోవడం – మధ్య, మధ్యలో ఆ ఇంటి వెలుగు – అమ్మాయి చిరంజీవి సుజాత ఆప్యాయంగా తయారు చేసి అందించిన కమ్మని వేడి, వేడి పానీయాన్ని సేవించడం – ఫోటోలు తీసుకోవడం…. ఇవన్నీ కూడా మా మధ్య స్నేహలత తొడిగిన సువర్ణ, సుందర, సువాసనభరిత పుష్పాలు !.

 

ఇటీవల తనని కలిసిన సందర్భం గా నాకు బ్నిం ప్రేమపూర్వకం గా అందించిన కానుక తాను వ్రాయగా – శ్రీ పీఠం వారు ప్రచురించిన ” చిల్డ్రన్ అండర్ స్టాండింగ్ “- పెద్దల కోసం బాలశిక్ష — అన్న పుస్తకం తన చేతులనుండి అందుకుంటూ బ్నిం తో అన్నాను — పుస్తకం లోపల ఏదయినా తోచినది రాసి ఇవ్వమని. అప్పుడు ” అలానే ” అంటూ ఏదో రాసి మళ్ళా పుస్తకాన్ని నా చేతులలో పెట్టాడు..

ఏమి రాసాడా అని అట్ట తిప్పి చూద్దును కదా……

” అన్నా నీ అనురాగం

ఎన్నో జన్మల పుణ్యఫలం

– బ్నిం  ”

ఇదీ తాను రాసింది–

మూగపోయింది నా నోరే కాదు… నా మనసు కూడా !

అనుబంధం… ఆత్మీయత… ఒక్కటయిన ఆ క్షణం తీయనిది – ఎంతో విలువయినది అది !!

ధన్యవాదాలు –

<!>*** నమస్తే ***<!>