Cultural, Film

Amaragayakudu

 

అమర గాయకుడు ఘంటసాల గారి 95 వ పుట్టినరోజు సందర్భంగా వారి కుమార్తె నీరాజనం….

5 డిసెంబర్ 2011 సంచిక నుండి పునర్ముద్రితం ( శ్రీమతి ఘంటసాల శ్యామల గారికి కృతజ్ఞతలతో )

ఈ సందర్భంగా ఆ మహా గాయకునికి స్వరనీరాజనం ….. ఘంటసాల పాడిన 100 గీతాల Jukebox ….

Courtesy : Saregama South 

Literature

Adrushtavantudu

గుళ్ళో భజన….

లౌడుస్పీకర్ ని బద్దలుకొట్టి…

ఇంట్లోకి ప్రవేశించి…

చదువు గుండెల్లో గుచ్చుకుంది!

 

కళ్యాణమండపం ముందు..

బాణసంచా …..

వీధిగది కిటికీ లోంచి లోపలికి దూరి…

మంచం మీద ముసలిగుండెను…

పేల్చేసింది!

 

రోడ్డు మీద ప్రవాహాన్ని….

హారన్లు చావగొట్టి ….

చెవులకి చిల్లులు పొడిచాయి!

 

కొత్తసినిమా లో…

రెచ్చిపోయిన…

ఎలాక్ట్రానిక్ వాద్యాలు..

పాటని పీక నొక్కి చంపేసాయి!

 

అర్ధరాత్రి దాటినా …

అరుస్తున్న టి.వీ.నోరు…

నిద్రని నమిలి మింగేసింది!

 

నేను  బ్రతికే ఉన్నాను.

ఎందుకంటే….

నేను….

చెవిటివాణ్ణి !

Classic, Literature

Meghadootham

మహాకవి కాళిదాసు రచించిన ” మేఘదూతం ” నుంచి రెండవ శ్లోకం గానంతో బాటు తాత్పర్య, ‘ శ్రీకళా’ఖ్య వ్యాఖ్యోపేతం… ఈ క్రింది వీడియో లో….


Meghadootham

Literature

Galipatam

గాలి వాటంగా వీస్తోంది. రవి ఇంట్లోంచి బయటకి వచ్చి నిలబడి వీథిలో ఆటలకి వచ్చిన జతగాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూసాడు. ఇంకా ఎవ్వరు రాలేదని నిరుత్సాహంగా నిట్టూర్చాడు.

 రోడ్డుచివర ఉన్న పంట పొలాల్లో కోతకొచ్చిన పైరు తలలూపుతోంది.

వీథి గుమ్మంలో నిలబడ్డ రవి గ్రౌండ్ కి వెళ్లి కాసేపు బాల్ బాడ్మింటన్ చూశాక గాలిపటాల సీజను మొదలైంది, ఎవరెవరు ఎలా ఎంత ఎత్తు ఎగరేస్తారో చూడాలి అనుకున్నాడు. సాయంకాలం పచ్చని గడ్డిమొలిచిన పెద్ద ఆట స్థలం లో   బాడ్మింటన్ చూసిన తర్వాత ఎదురింటి సత్తిరాజు రామం చార్టుతో తయారుచేసిన గాలిపటం ఎగరేస్తే పోటిగా అందరు ఎగరేసారు. అలా గాలి పటాలు ఎగురుతూ ఉంటే సాయంత్రపు నీలాకాశం రంగురంగుల “పతంగుల పరదా “కప్పుకుని సరదాపడుతూ ఉంటే భలే గొప్పగా ఉంటుంది. అలవోకగా చేతిలో దారాన్నీ వదులుతూ గాలిపటాన్ని ఎగరవేసే ఒడుపుగా చేతులు మారుస్తూ ఏకాగ్రత అంతా గాలి పటాలమీదే ఉంచుతారు.

సోమయ్య గారి నాయుడు హైదరాబాద్ నుంచి చాలా ఖరీదైన గాలి పటం తెప్పించాడని చెఱుకువాడ అంతా చెప్పుకుంటున్నారు.

ఈలోగా సత్తిరాజు రామం పెద్ద దారపు కండె, పెద్ద తోకతో పాము తలలా ఊపుకుంటూ ఆడుతున్న గాలిపటం తో ఎత్తరుగుల అరుగుమీద నుంచి ఒక్కదూకు దూకాడు. రామం గ్రౌండ్ కి గాలిపటాన్ని భుజంమీద వేసుకొని “ ఏరా ! రవి వస్తావా ? ” అనగానే వాడు నిక్కరు పైకి లాక్కొని” ఓ” అంటూ వెనకాలే పరుగెత్తాడు.

“ రామం అన్నయ్య ! నాకు ఒక గాలిపటం చేసిపెట్టవూ ? “

“ చేస్తారా ! మీ డాడీ హిందూ పేపర్ తెప్పిస్తారుగా ! అందులో  ఆదివారం వచ్చే పేపర్ కాస్త స్ట్రాంగ్ గా ఉంటుందిరా ! అదయితే ఎంత గాలి వేసిన చిరగదురా ! దాంతో తయారు చేద్దాం! ” అని భరోసా ఇచ్చాడు.

“ చార్టుతో అయితే నువ్వు మోయలేవురా ! ” అనగానే “ ఓ అలాగే అన్నయ్య ఎప్పుడు చేస్తావు ? ” అని రవి ఆతృతగా అడిగాడు. “ ఉండరా ! రేపు సెలవు కదరా ! రేపు చూద్దాం ! ” అని మాటల్లో గ్రౌండ్ చేరగానే ఆకాశంలో రంగు రంగుల గాలిపటాలన్ని పోటా పోటిగా ఎగరేసే పిల్లలతో సందడిగా ఉంది.                                  

ఒకపక్క ఊలు బాలు తో బాడ్మింటన్ ఆడుతున్న చెరుకువాడ యూత్ క్లబ్ కుర్రాళ్ళు టోర్నమెంట్లకి సిధ్ధం అవుతూ బంతి అటూ ఇటూ కిందపడకుండా పోటాపోటిగా ఆడుతున్నారు.

రవిని గాలిపటం పట్టుకొని వెనక్కి వెళ్ళమని చెప్పాడు రామం. చేతిలో దారపు కండె తో నెమ్మదిగా దారం వదులుతూ పరిగెట్టి ఇద్దరు గాలిలో ఎగరేసారు. ఆకాశంలో గద్దలు తమకు పోటీగా ఈ రంగు రంగుల పక్షులేంటా అని అవి ఇంకా పైకి ఎగురుతున్నాయి. చిన్న చిన్న కాగితపు ముక్కలకి చిల్లు పెట్టి దారం ఉండ లోంచి దూర్చి వదిలిన కాగితాలు దారం మీద నుంచి వేగంగా పటం వరకు ( పారా బోలిక్ ) ఒంపుతిరిగిన దారం మీద నుంచి స్పీడుగా వెడుతూంటే భూమి నుంచి ఆకాశానికి సందేశాలు పంపుతున్నట్లు ఆనందపడుతున్నారు. రామం కి పోటిగా సోమయ్య గారి నాయుడు రంగురంగుల బట్టలతో మెడలో పులిగోరు, బంగారు కడియం ఒక చేతికి, మరో చేతికి  కొయిటా వాచీతో రంగురంగుల గాలిపటాన్ని తన మందీ మార్బలంతో అడుగుపెట్టి హడావుడిగా మంజాతో తయారుచేసిన దారం తో నలుగురు పిల్లల గాలి పటాలు తెంపేసాడు.

వాళ్ళ పటాలు గాలిలో తేలుతూ ఎక్కడకో ఎగిరి పోయాయి. పిల్లలు ఏడుస్తూ ఉంటే వాడు చంకలు గుద్దుకుని సంబరపడడం రవికి రామానికి నచ్చలేదు. వాడికి దూరంగా ఎగరవేసుకుంటున్నా వాడు రెచ్చకొడుతూ పక్కకే వచ్చి ఎగరెయ్యసాగాడు.

రామం గాలిపటానికి దారం నాలుగు పేటలు కలిపి ఎగరేస్తాడు.

నాయుడు తన గాలి పటం దారంతో మెలి వెయ్యడానికి ప్రయత్నం చేసాడు కానీ సాథ్యపడలేదు. రామం వదిలిన పటం చాలా ఎత్తున ఎగరడం తో వెర్రెత్తిపోయిన  సోమయ్యగారి నాయుడు కసితో  ఇంకా గాలిలో కి మొత్తం దారం వదిలేయడంతో హైదరాబాదు పతంగు కాస్త  పలాయనం చిత్తగించింది.

దాని వెనకాలే పరుగెత్తాడు నాయుడు దాన్ని వెదుక్కుంటూ. పిల్లలందరు భలే ! భలే అంటూ వెక్కిరిస్తు గంతులేసారు.

చీకటి మూసుకుంటోంది. చుక్కలు పొడవడం మొదలవగానే గాలిపటాలని దింపి ఇంటికి బయలు దేరారు పిల్లలందరు కబుర్లాడుకుంటూ.

“ ఒరే ! రామం అన్నయ్యది టాపున ఉందిరా ! ” అనుకుంటూ అందరు రామాన్ని చుట్టుముట్టి “ మాకు కూడా ఒక పటం చేసిపెట్టవా ? ” అంటూ మీద పడితే “ తప్పకుండా వచ్చే ఆదివారం చేసిపెడతానురా ” అని వాళ్ళను ఊరుకోబెట్టి పంపాడు.

రవి కి మాత్రం తరవాత రోజు హిందూ పేపర్ని చక్కగా చతురస్రం గా కట్ చేసి, కొబ్బరి ఈనెకి దారం కట్టిన బాణాన్నీ మథ్యలో మైదాతో జాగ్రత్తగా అతికించి, మథ్యలోనే సూత్రం కూడా కట్టి, పటానికి చెవులదగ్గర చొక్కా కాలర్సులా అతికించి పాము తోకలా పెద్ద తోక తయారు చేసి చివర అతికించాడు. రవి దాన్ని చూసి ఆనందపడిపోయాడు. “ రామం అన్నయ్యా ! థాంక్స్ ” అనగానే, రామం “ థాంక్సు కాదురా ! దీని తయారి ఖరీదు ఒక రూపాయి పట్టుకురా ! ” అనగానే రవికి నోటమాట రాలేదు. “ అన్నయ్యా ! రూపాయా ? నా దగ్గర లేదు. మా నాన్నని అడిగి తేవాలి. ఏం అంటాడో ? ” అని బతిమాలినా రామం ఇవ్వలేదు. కాసేపు బతిమాలాకా “ సరే ! మా ఇంటి ఎదురుగా ఉంటావని, నీకు ఫ్రీగా ఇస్తున్నా! ఎవరికి చెప్పకు ” అని ఊరించి ఊరించి చివరకు ఇచ్చేడు.

ఆనందంగా దాన్ని తీసుకుంటూ “ నేను ఎవరికి చెప్పను ” అని ఇంట్లోకి పరిగెత్తి దారం ఎలా సంపాదించాలా అని ఇల్లంతా వెతికి అల్మారాలో ఒక దారపురీలు దొరకపుచ్చుకొన్నాడు.

డిసెంబర్ చివరి ఆదివారం !

పొగమంచు తొలిగి రవికిరణాలు చెట్ల మథ్య లోంచి రామం ఇంటి అరుగుమీద పడుతున్నాయి. అప్పటికే అరడజను మంది.పిల్లలు గాలి పటాలకోసం వేచి చూస్తున్నారు. రామం ముందే వాళ్ళకి చెప్పాడు తన గాలిపటం ధర ! సిథ్థమైన వాళ్ళందరు తీసుకెళ్ళారు. అందరు రంగురంగుల కాగితాలతో చేయించుకున్న గాలిపటాలతో గ్రౌండు లో సంక్రాంతి పండగ సెలవలకి ఆనందంగా ఎగరేసుకొంటున్నారు.

ఒక రోజు రామం అందరిని తన దగ్గరకి రమ్మనమని కబురు పంపాడు. పచ్చ గడ్డిలో వృత్తాకారం లో కూర్చున్నారు. మథ్యలో రామం, అతని పక్కన వీరబాబు కూర్చున్నాడు. గ్రౌండులో ఒక మూల పూరిగుడిసెలో బాల్ బాడ్మింటన్ బ్యాట్లు బాగుచేసిపెట్టడం, గెట్ వేయడం, స్ట్రింగ్స్ వేయడం చేసి నాలుగు పైసలు సంపాదించుకొంటున్న వెంకటరత్నం కొడుకు అతను.

“ ఒరేయి! తమ్ముళ్ళు. వీడు మీకందరికి తెలుసుకదా! వీడు ఏడాది పాటుగా స్కూలు ఫీజు కట్టలేక స్కూల్ కి వెళ్ళట్లేదుట ” అని మాట ఆపి వాళ్ళకేసి చూడగా, అందరు జాలిగా చూస్తున్నారు. మనందరం ఎంచక్కా అమ్మ.నాన్న ఇచ్చిన డబ్బుల్తో అన్ని రకాల ఆటలు ఆడుతున్నాం, స్కూల్ కి వెడుతున్నాం. మీ అందరికి నా మీద కోపం వచ్చే ఉంటుంది. ఎందుకంటే నేను మీ దగ్గర గాలి పటాలకి డబ్బులు తీసుకున్నందుకు.

“ ఒక మంచిపని చెయ్యడానికే నేను స్ట్రిక్టుగా ఉన్నాను మీ అందరి దగ్గరా ! మన వంతు సాయం మనం చేద్దాం ” అని తన జేబులోంచి ఐదువందల రూపాయిలు తీసి వీరబాబుకి ఫీజుకి, పుస్తకాలకి ఇచ్చాడు. అందులో తన వాటా ఏభై రూపాయిల తో కలిపి, ఒక గాలిపటం కూడా ఇచ్చాడు దారం తో. వాడి మనస్సు గగనం లో అందాల పతంగులా ఎగురుతున్నట్టు వాడి మొహం చెప్తోంది.

ఈ విషయం తెలిసిన బాడ్మింటన్ క్లబ్ వాళ్ళు కూడా ఇతోథికంగా సాయం చేసారని రవికి, రామానికి తెలిసింది. రవి వాళ్ళ నాన్నని అడిగి పదిరూపాయలుతో వీరబాబుకి కంపస్ బాక్సు కొనిచ్చాడు.

ఆ రోజు సాయంకాలం గాలిపటాలని గాలి తనతో మరింత అందనంత ఎత్తుకి తీసుకెళ్ళి, అక్కడ ఊసులాడుతోంది. అందులో వీరబాబు అందమైన గాలిపటం కూడా ఎగురుతోంది పోటీగా !

Literature, Patriotic

Swatantryadeepthi – Shiramulu

 

శిరములు హిమశైలోన్నతశిఖరము లై నిలవాలి !

మంచుకొండఅంచులలో మనజెండా యెగరాలి !

మనభారతనందనాన మధుమాసం విరియాలి !

పేదవాడిగుండెల్లో విరిజల్లులు కురియాలి !

గులాబీపూవులసరసన గుడ్డిపువ్వులూ నవ్వాలి !

గుడ్డిపువ్వులూ నవ్వాలి – గడ్డిపువ్వులూ నవ్వాలి !

కలతలకన్నీటిబ్రతుకు కమ్మనికల కావాలి !

అమవసగుండెలు చీల్చుకు పున్నమ విరబూయాలి !

గళము గళమునా ఒక సింహం గర్జించాలి !

పిలుపుపిలుపునా అమృతం ప్రవహించాలి !

జనగణమన గానంలో జగతి పరవశించాలి !

జనహృదయం సముద్ర మై జయ హిం దని ఘోషించాలి !

మబ్బుతెరలు చీల్చుకుకొనుచు మనజెండా యెగరాలి !

కన్నతల్లికన్నులలో కమ్మనికల పండాలి !

శిరములు హిమశైలోన్నతశిఖరము లై నిలవాలి !

మంచుకొండఅంచులలో మనజెండా యెగరాలి !

Spiritual

Kamakshi Kavachamu

     

           జయము జయ జయ జగన్నాయకి !

            జయము జయ జయ జగద్రక్షకి !

            జయము జయ జయ జగజ్జననీ !

            రక్షమాం ! కామాక్షిరో !

 

                                            జయము విజయము సర్వవ్యాప్తా

                                            జయము విజయము సర్వమంగళ !

                                            జయము విజయము సర్వజననీ !

                                            రక్షమాం ! కామాక్షిరో !

 

            మంగళం జయ మరకతాంగీ !

            మంగళం శివ మనోల్లాసినీ !

            మంగళం జయ మధురవాణీ !

            రక్షమాం ! కామాక్షిరో !

 

                                            అణువులను పరమాణువులందున

                                            అఖిలజగముల అద్భుతంబుగ

                                            అమరితివి ఆనంద సాగరి

                                            రక్షమాం ! కామాక్షిరో !

 

            అమల పురమున వెలసినావే

            చంద్రమౌళీశ్వరుని రాణిగ

            అమల ! బాలాత్రిపుర సుందరి !

            రక్షమాం ! కామాక్షిరో ! 

                                                          

                                 అమలపురి అమలేశు పత్నిగ

                                 అమరితివి అమలేశ్వరీ ! జయ !

                                 విమల ! కంజ దళాయతాక్షీ !

                                 రక్షమాం ! కామాక్షిరో !

 

           వరద ! కృష్ణేశ్వరుని సతి శ్రీ

           రాజరాజేశ్వరి ! నిరంజని !

           కరుణ చూపవె ! కనకవల్లీ !

           రక్షమాం ! కామాక్షిరో !

 

                                 భక్తకోటికి క్షణములోనే

                                 ముక్తినిడ ముక్తేశ్వరంబున

                                 ముక్తికాంతగ ! వెల్గుచుంటివి !

                                 రక్షమాం ! కామాక్షిరో !

 

           శివానీ ! శ్రీశైల నాధుని

           భామినీ ! బ్రమరాంబ ! మల్లిక

           భవానీ ! భవపాశమోచని !

           రక్షమాం ! కామాక్షిరో !

 

                                 జ్ఞానదాశ్రీ కాళహస్తీ

                                 శ్వరుని రాణీ ! ప్రసూనాంబా

                                 జ్ఞాన మిడుమా ! జ్ఞానసింధూ !

                                 రక్షమాం ! కామాక్షిరో !

 

          మాలినీ ! మహిషాసురాంతకి !

          మాలినీ ! మాతంగి ! వైభవ

          శాలినీ ! శ్యామలా ! భార్గవి !

          రక్షమాం ! కామాక్షిరో !

 

                                 నారదాది మునీంద్ర సన్నుత

                                 శారదా ! సంగీతలోలా

                                 కొరెదనునీ కృపావర్షము

                                 రక్షమాం ! కామాక్షిరో !

 

           ఉమానందేశు భామిని

           క్షమాసంపద్గుణ విలాసిని

           సమానము నీకెవ్వరమ్మా ?

           రక్షమాం ! కామాక్షిరో !       

 

                                 సర్వమంగళ పార్వతీ శ్రీ

                                 చెన్నమల్లేశ్వరుని రాణీ,

                                 పుణ్య గంగలకుర్రు వాసిని !

                                 రక్షమాం ! కామాక్షిరో !       

 

           గ్రామగ్రామమునందు నీవే

           గ్రామదేవతగాను వెలిసీ

           కాచిబ్రోతువు భక్తకోటిని

           రక్షమాం ! కామాక్షిరో !       

 

                                 శుభాలిచ్చెడి సుబ్బాలమ్మా !

                                 నూకలిచ్చెడి నూకలమ్మా !

                                 రాజ్యామిచ్చెడి రాజ్యలక్ష్మీ !

                                 రక్షమాం ! కామాక్షిరో !       

 

          వానపల్లిని పళ్లాలమ్మవు

          పెద్దపురి మరిడెమ్మ మాతవు

          విజయనగరిని పైడితల్లివి

          రక్షమాం ! కామాక్షిరో !       

 

                                 కొలిచినంతనె కొలువుదీరుచు

                                 పిలిచినంతనె పలుకు తల్లివి

                                 తలతు సతతము తలుపులమ్మా !

                                 రక్షమాం ! కామాక్షిరో !       

 

           కన్నులిత్తువు కాళ్ళ నిత్తువు

          బుద్ధినిత్తువు బ్రతుకు నిత్తువు

          అన్నియును ఆశ్రితుల కిత్తువు

          రక్షమాం ! కామాక్షిరో !       

 

                                 శిల్పశైలీ రస సమన్విత

                                 కవనమూ కావ్యమ్ము నీవే

                                 విశ్వసాహితి అరయనీవే

                                 రక్షమాం ! కామాక్షిరో !       

 

            భావశోభిత భాషనీవే

            అర్థశోభిత పదమునీవే

            వర్ణశోభిత కావ్యమీవే

            రక్షమాం ! కామాక్షిరో !       

 

                                 శ్రుతిలయాన్విత కీర్త నీవే

                                 రసఃపూరిత కవితనీవే

                                 భక్తిశోభిత భజన నీవే

                                 రక్షమాం ! కామాక్షిరో !       

 

 

           గీతమూ సంగీతమూ నా

           గొంతులో సంకీర్త నీవే

           గానమూ నా ప్రాణమీవే

           రక్షమాం ! కామాక్షిరో !       

 

                                 కలిమినిత్తువు బలిమినిత్తువు

                                 విద్య నిత్తువు వినయమిత్తువు

                                 బుద్ధినిత్తువు భుక్తి నిత్తువు

                                 రక్షమాం ! కామాక్షిరో !       

 

            కన్యకకు తగు వరుని యిత్తువు

బ్రహ్మచారికి వధువునిత్తువు

వంధ్యులకు సంతానమిత్తువు

రక్షమాం ! కామాక్షిరో !

 

                                 రాహుకాలపు దీపములు నీ

                                 ప్రాంగణము వెలిగించు వారీ

                                 కోర్కెలన్నీ తీర్చి బ్రోతువు

                                 రక్షమాం ! కామాక్షిరో !

 

యోగకర్మ విరక్తి ధ్యానా

జ్ఞాన మార్గముల లవియా ? నా

భక్తి పాయసమారగింపుము !

రక్షమాం ! కామాక్షిరో !

 

                                 కరుణ ప్రేమలు కలుగలేదా ?

                                 కరగదామది ? కఠిన శిలయా ?

                                 కన్నతల్లివి కాద ? తెలుపుము !

                                 రక్షమాం ! కామాక్షిరో !

 

వత్పమునకై గోవు రాదా ?

బిడ్డ బోవగ తల్లిరాదా ?

కన్నతల్లీ కరుణ రాదా ?

రక్షమాం ! కామాక్షిరో !

 

                                 జీవి పరితాపమును చూచీ

                                 జీవు వేదన నాలకించీ

                                 కావుమా కారుణ్య వారిధి !

                                 రక్షమాం ! కామాక్షిరో !

 

ఎన్ని గ్రహములు ఏకమైనా

ఏమి కీడును నాకుజేయును ?

నీదు కృప నాకెపుడు యుండగ

రక్షమాం ! కామాక్షిరో !        

 

                                 శాంకరివి శ్రీలంక పురిలో

                                 కంచిలో కామాక్షి మాతవు

                                 శృంగళపు ప్రద్యుమ్న పురిలో

                                 రక్షమాం ! కామాక్షిరో !       

 

కంసపురి చాముండి వీవే

ఆలంపురమున జోగులాంబవు

శ్రీగిరీ భ్రమరాంబనీవే

రక్షమాం ! కామాక్షిరో !       

 

                                 కొల్హపురి శ్రీమహాలక్ష్మివి

                                 మాహురంబున ఏకవీరవు

                                 ఉజ్జయిని శ్రీమహాకాళివి

                                 రక్షమాం ! కామాక్షిరో !       

 

పిఠాపుర పురుహుతికీవే

ఓఢ్యాణపు గిరిజనీవే

దక్షపురి మాణిక్యమీవే

రక్షమాం ! కామాక్షిరో !       

 

                                 హరిక్షేత్రపు కామరూపిణి

                                 మాధవీవె ప్రయాగ నగరున

                                 జ్వాలపురి వైష్ణవీదేవీ

                                 రక్షమాం ! కామాక్షిరో !     

Cultural, News

AnandaVihari – 07_007

అలరించిన “మాయాబజార్”

శశిరేఖ, అభిమన్యుల ఆటపాటలు, ఘటోత్కచుడి ఆకతాయితనం, చిన్నమయ, లంబు జంబుల మధ్య హాస్య సంభాషణలు, లక్ష్మణ కుమారుడి అల్లరి.. “బయబజార్” అనగానే ఈ సన్నివేశాలన్నీ గుర్తొచ్చి మనసును పులకింపజేస్తాయి.
1957లో విడుదలై నేటికీ ఆబాలగోపాలన్ని అబ్బురపరుస్తున్న “మాయాబజార్” చిత్రంలోని మధుర ఘట్టాలను “మద్రాసు మువ్వలు” మహిళా బృందం కళ్ళముందుంచింది. అమరజీవి స్మారక సమితి శనివారం ఏర్పాటు చేసిన “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో “మాయాబజార్” 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “మద్రాసు మువ్వలు” ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పించింది.

క్రొవ్విడి రమాదేవి (కృష్ణుడు, మాయా కృష్ణుడు),   సరస్వతి (శశిరేఖ, లక్ష్మణ కుమారుడు),  తిరుమల ఆముక్తమాల్యద (శర్మ) రేవతి, వసంతలక్ష్మి (బలరాముడు, మాయా శశిరేఖ) శశిరేఖ, శాస్త్రి, దారుకుడు (లేళ్ళపల్లి శ్రీదేవి)నెల్లుట్ల లీల (సారథి) పత్రి అనూరాధ (లంబు) వసంత (జంబు, బలరాముడు), వసుంధర (ఘటోత్కచుడు), శ్రీలక్ష్మి (శకుని), జోశ్యుల ఉమ (పురోహితుడు), భానుమతి (చిన్నమయ, అభిమన్యుడు), భారతి (హిడింబి), ఉమ (సుభద్ర) ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

చిత్ర నిర్మాణ విశేషాలను ముళ్ళపూడి శ్రీదేవి, బాలాంత్రపు లావణ్య వినిపించి అలరించారు. మరాఠీ, గుజరాతీ భాషల్లో ప్రసిద్ధి చెందిన నాటకం ఆధారంగా అనేక చలన చిత్రాలు విజయా వారు తీసి విజయవంతం చేసిన “మాయాబజార్” (1957) చలన చిత్రం

బాల శశిరేఖను చెలికత్తెలు ఆటపట్టించడంతో మొదలుపెట్టి నవరసాలు ఉట్టిపడే అనేక సన్నివేశాలను నటించి పండించారు. అనూరాధ సన్నివేశాలను వివరించారు.

అల్లిబిల్లి అమ్మాయికి (పత్రి అనూరాధ, ఎస్పీ వసంతలక్ష్మి) నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహిరిలో (వసంత, వసుంధర), భళి భళి (ఉమ) తదితర పాటలు అలరించాయి.
వసుంధర ఘటోత్కచుని పాత్రను పోషిస్తూ వినిపించిన పద్యం అలరించింది. చిన్నమయ, లంబు జంబుల మధ్య హాస్య సంభాషణలు సభను నవ్వించాయి. కంచుకంఠంతో సుభద్ర పాత్రధారి ఉమ వినిపించిన పద్యం, “ఆహా నా పెళ్ళి అంట” పాట ప్రేక్షకుల మన్ననలందుకున్నాయి. “ఆహా నా పెళ్ళంట”, “వివాహ భోజనంబు” తదితర పాటలకు ప్రేక్షకులు కూడా గొంతు కలిపారు.

కల్పన గుప్తా కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరజీవి స్మారక సమితి కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సకల కళా వల్లభుడు బాలమురళి 

ఎస్. జానకి

 

అనేక అంశాలలో బాల మురళి ది అందెవేసిన చేయి అని ప్రముఖ సినీ గాయని ఎస్ జానకి కొనియాడారు.  ఇటీవల జరిగిన బాలమురళి మొదటి వర్ధంతిని పురస్కరించుకొని శర్వాణి సంగీత సభా ట్రస్టు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 03 వ తేదీ ఆదివారం సాయింత్రం టీనగర్ ఇన్ఫోసిస్ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ అతిథిగా హాజరైన జానకి మాట్లాడుతూ…. ఆయన సంగీత దర్శకత్వంలో పాడిన పాటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పురస్కారాలను అందుకున్నానని గుర్తు చేశారు. తనను ఆయన శిష్యురాలిగా భావించేవారని, అది తనకు గౌరవమని పేర్కొన్నారు. ఆయన మరణానికి నెల ముందు కలిశానని, తనను గుర్తుపట్టారని వెల్లడించారు. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నామని, హైదరాబాద్ వచ్చి కచేరి చేస్తానని ఆయన తనకు మాట ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. “వసంత గాలికి వలపులు రేగ”పాటను ప్రముఖ గాయకుడు నీహాల్ తో కలిసి మధురంగా వినిపించారు. ఒక కన్నడ పాట, “తోడు” అనే చిత్రంలో ఆయన సంగీతంలో తను పాడిన పాట పల్లవులను పాడి సభను ముగ్ధులను చేశారు. తను హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చింది కార్యక్రమ నిర్వాహకురాలు వసంత కోసమేనని వెల్లడించారు. 

వి ఏకె రంగారావు మాట్లాడుతూ..తనకు నాలుగేళ్ళ వయసు నుంచీ బాలమురళీకృష్ణ తెలుసునని, తనకన్నా వయసులో కొంచెమే పెద్ద అయిన ఆయన గాత్రం మొదటిసారి విని తను, తన బాలలు ముగ్ధులయ్యామని అన్నారు. కొత్త సొబగులను జోడించి ఒక రాగ స్వరూపాన్ని నిర్ణయించే అధికారం ఆయనకు ఉండేదని ప్రశంసించారు. తన విమర్శను మంచి మనసుతో స్వీకరించేవారని గుర్తు చేసుకున్నారు. అన్నమాచార్య కీర్తన మొట్టమొదటి ఎల్పీ రికార్డు ఆయన గాత్రంలోనే వెలువడిందని గుర్తు చేశారు. ఆయన నృత్యం కోసమని ప్రత్యేకంగా తిల్లానాలు రూపొందించకపోయినా అవన్నీ ఆ ప్రక్రియకు అద్భుతంగా అమిరాయని వ్యాఖ్యానించారు. 

సంగీత ప్రపంచానికి ఒక యుగ పురుషుడు బాలమురళి అని ప్రముఖ సంగీత విద్వాంసులు  తాడేపల్లి లోకనాథ శర్మ వెల్లడించారు. ఆయన తనను చిన్నప్పుడు ఎత్తుకునేవారంటూ ఒక మధురానుభూతిని పంచుకున్నారు. మాధుర్య ప్రధానంగా, సాహిత్య భావంతో పాడడంలో తనతో సహా అనేకమందికి ఆయన మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. 1978లో వాసుదేవ్ అనే అభిమాని తన మీద  బాలమురళి మీద ఒక పాట రాసి ఆయననే ట్యూన్ చేయమనగా, తన మీద రాసిన పాటకు తనే సంగీతాన్ని అందించడం సమంజసం కాదని పేర్కొని ఆ పనికి తన పేరును సూచించారని వివరించారు. అప్పుడు ఆయన స్వహస్తాలతో రాసిన లేఖను చదివి వినిపించారు. 

ముఖ్య అతిథిగా హాజరైన కె. రాధాకృష్ణ గణపతి (ప్రిసైడింగ్ ఆఫీసర్, డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్ 3, తమిళనాడు) మాట్లాడుతూ.. బాలమురళి అనగానే నారదుడి వేషంలో ఆయన పాడిన పాటలే గుర్తొస్తాయని అన్నారు. 

బాలమురళి పాడితే మనసు ఊయలలూగేదని ప్రసిద్ధ సినీ గీత రచయిత భువనచంద్ర అన్నారు. కె. రామలక్ష్మి రాసిన “తరాలు” అనే టీవీ ధారావాహిక కోసం తను రాసిన గీతానికి ఆయన సంగీతాన్ని కూర్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

బాలమురళి రెండవ కుమారుడు డా. సుధాకర్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. 

ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ పంపించిన సందేశాన్ని కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీమతి రాంనాథ్ చదివి వినిపించారు. 

బాలమురళీకృష్ణ రూపొందించిన అన్ని కీర్తనలూ వచ్చిన వాసుదేవ్, సంస్థ వ్యవస్థాపకురాలు వసంత, నిర్వాహకులు సూరి శ్రీవిలాస్, కమిటీ సభ్యులు,  నగర ప్రముఖులు కార్యక్రమానికి  హాజరయ్యారు. 

శివంగి కృష్ణకుమార్, నేహా వేణుగోపాల్ లు ఆలపించిన బాలమురళీకృష్ణ కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. 

సభా కార్యక్రమం అనంతరం బాలమురళీకృష్ణ శిష్యులు కృష్ణ కుమార్, ఆయన శ్రీమతి బిన్నీ కృష్ణ కుమార్ లు బాలమురళి కీర్తనలతో చేసిన  గాత్ర కచేరి రసరమ్యంగా జరిగింది.

Classic, Cultural, Spiritual

An Appeal_Sravana Sadan

విజయవాడ మాజీ మేయర్ డా. జంధ్యాల శంకర్ గారు చేస్తున్న విజ్ఞప్తి….. ఇక్కడ…

Cultural, Literature

Bnim – To.Le.Pi.

“ బ్నిం ” —

ఇదేమిటి – ఈ ‘ ఏకాక్షరం ‘ పేరేమిటి అని ఊరికే తెగ హాశ్చర్యపోకండి సుమీ !….. 

అదేనండీ బాబూ – ఆయన పేరు బ్నిం — అర్ధం కాలేదా… …

– అసలు పేరు భమిడిపల్లి నరసింహమూర్తి ( ట ) – అలా అని ఆయన ఒప్పేసుకున్నా గానీ – ఇంటా, బయటా అందరూ ఆయనని ప్రేమగా, ముద్దుగా, కామన్ గా ( బొట్టు పెట్టకపోయినా ) పిలిచే పేరు బ్నిం అని – అదే అసలు సిసలైన పేరు గా చెలామణి అయిపోతోంది ఇన్నాళ్లు — ఇన్నేళ్లు… ఇక ముందూ అంతే మరి !

సరే — ఆయన బయోగ్రఫీ వివరాలు కొన్ని సంక్షిప్తం గా ~

రాబోయే పెద్దరికానికి బాట వేసే చిన్నరికం ( చిన్నతనం – బాల్యం ) లో బ్నిం బడికి వెళ్లలేదనటం – అయినా అదేమీ లోటుగా అనిపించింది కాదు – అందుక్కారణం ఆయన తండ్రి గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు అయిన శ్రీ సూర్యనారాయణ గారి ఆయుర్వేద శిక్షణ లో సుశిక్షితుడై – ఆయన అందించిన వెలుగులతో రాణించాడు – మరో ఆయుర్వేద వైద్యునిగా ఆ వెలుగుల వెచ్చదనాన్ని పంచుకున్నారు. ఇక బ్నిం తాతగారు ( మాతామహులు) అయిన శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు గొప్ప పండితులు. వారి కుమార్తె, బ్నిం తల్లిగారు అయిన శ్రీమతి విజయలక్ష్మి గారు సంసృత, తెలుగు భాషాకోవిదురాలు – అనన్య సాహితీ పరిణతిని ఆర్జించిన ఉత్తమ ఇల్లాలు – విజయలక్ష్మి గారి గురించి వారి పాండిత్య గరిమ గురించిన నేను విన్న ఒక విషయం — శ్రీయుతులు బాపు – రమణలు ఈటీవి వారికి శ్రీభాగవతం ని చిత్రీకరణ చేస్తున్న రోజులలో – పౌరాణికపరమైన ఏ సందేహం వచ్చినా – దానిని వెంటనే నివృత్తి చేసుకోవడం కోసం విజయలక్ష్మి గారిని సంప్రదించేవారని – అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే వారి ఇతిహాస, పురాణ శాస్త్ర జ్ఞానం అంత ఉన్నతస్థాయి కి చెందినది అన్నమాట !

బ్నిం సాహితీ వ్యవసాయం గురించి చెప్పాలంటే.. ఎంతో ఉంది… దీనిని గురించి ఎంత చెప్పినా… ఎంతసేపు చెప్పినా అది తరగనిది — ఏమంటే ఆయన నిత్య కృషీవలుడు. సాహితీ వ్యవసాయాన్ని సుసంపన్నం చేస్తూ అందులో బంగారు పంటలను పండించే పుణ్యమూర్తి ఆయన – ఆయన ఒక కధారచయిత, పద్యకారుడు, చిత్రకారుడు, టి. వి. లో మాటల రచయిత — ఇదే రంగం లో నాలుగుసార్లు నంది పురస్కారాలను అందుకున్న ప్రముఖుడు – ఇవన్నీ ఒక ఎత్తు అయితే — అధిక సంఖ్య లో — అంటే దాదాపుగా 215 కూచిపూడి నృత్య రూపకాలకు రూపు దిద్ది తన మాటలతో ప్రాణం పోసిన శిల్పి ఆయన… అది మరో ఎత్తు…

బ్నిం కీ నాకు తొలి పరిచయము ఏర్పడిన సంఘటన చాలా చిత్రమయినది గా చెప్పవచ్చును. ఆప్తులు, ప్రముఖ చిత్రకారులు, వ్యంగ్య చిత్రకారులు, చలనచిత్ర దర్శకులు శ్రీ బాపు గారికి ఒకసారి నేను లండన్ నుండి వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించి 3 గంటల నిడివి లో ఉన్న FANTASIA వీడియో క్యాసెట్ ని కొని తెచ్చి చిరు కానుక గా పంపాను – దానిని అందుకుని బాపు గారు ఎంతో ఆనందపడుతూ క్యాసెట్ అందిన తక్షణం నాకు ఉత్తరం వ్రాసారు – నా నుండి ఈ విషయం విన్న బ్నిం, వీలయితే ఇంకొకసారి తనకీ ఒక క్యాసెట్ తెచ్చిపెట్టవలసినది గా నన్ను కోరడం జరిగింది. నా తదుపరి UK ట్రిప్ లో అక్కడ నుండి ఆ క్యాసెట్ తెచ్చి బ్నిం కి పంపాను – దానికి స్పందిస్తూ ఆయన నాకు బోణీ గా వ్రాసిన తొలి ఉత్తరం… ఇదిగో… ఈనాటి తోక లేని పిట్ట !

అటు తరువాత తనూ, నేనూ 2 – 3 పర్యాయాలు కలవడం – కలిసి కలబోత గా కబుర్లు చెప్పుకోవడం – మధ్య, మధ్యలో ఆ ఇంటి వెలుగు – అమ్మాయి చిరంజీవి సుజాత ఆప్యాయంగా తయారు చేసి అందించిన కమ్మని వేడి, వేడి పానీయాన్ని సేవించడం – ఫోటోలు తీసుకోవడం…. ఇవన్నీ కూడా మా మధ్య స్నేహలత తొడిగిన సువర్ణ, సుందర, సువాసనభరిత పుష్పాలు !.

 

ఇటీవల తనని కలిసిన సందర్భం గా నాకు బ్నిం ప్రేమపూర్వకం గా అందించిన కానుక తాను వ్రాయగా – శ్రీ పీఠం వారు ప్రచురించిన ” చిల్డ్రన్ అండర్ స్టాండింగ్ “- పెద్దల కోసం బాలశిక్ష — అన్న పుస్తకం తన చేతులనుండి అందుకుంటూ బ్నిం తో అన్నాను — పుస్తకం లోపల ఏదయినా తోచినది రాసి ఇవ్వమని. అప్పుడు ” అలానే ” అంటూ ఏదో రాసి మళ్ళా పుస్తకాన్ని నా చేతులలో పెట్టాడు..

ఏమి రాసాడా అని అట్ట తిప్పి చూద్దును కదా……

” అన్నా నీ అనురాగం

ఎన్నో జన్మల పుణ్యఫలం

– బ్నిం  ”

ఇదీ తాను రాసింది–

మూగపోయింది నా నోరే కాదు… నా మనసు కూడా !

అనుబంధం… ఆత్మీయత… ఒక్కటయిన ఆ క్షణం తీయనిది – ఎంతో విలువయినది అది !!

ధన్యవాదాలు –

<!>*** నమస్తే ***<!>