జయము జయ జయ జగన్నాయకి !
జయము జయ జయ జగద్రక్షకి !
జయము జయ జయ జగజ్జననీ !
రక్షమాం ! కామాక్షిరో !
జయము విజయము సర్వవ్యాప్తా
జయము విజయము సర్వమంగళ !
జయము విజయము సర్వజననీ !
రక్షమాం ! కామాక్షిరో !
మంగళం జయ మరకతాంగీ !
మంగళం శివ మనోల్లాసినీ !
మంగళం జయ మధురవాణీ !
రక్షమాం ! కామాక్షిరో !
అణువులను పరమాణువులందున
అఖిలజగముల అద్భుతంబుగ
అమరితివి ఆనంద సాగరి
రక్షమాం ! కామాక్షిరో !
అమల పురమున వెలసినావే
చంద్రమౌళీశ్వరుని రాణిగ
అమల ! బాలాత్రిపుర సుందరి !
రక్షమాం ! కామాక్షిరో !
అమలపురి అమలేశు పత్నిగ
అమరితివి అమలేశ్వరీ ! జయ !
విమల ! కంజ దళాయతాక్షీ !
రక్షమాం ! కామాక్షిరో !
వరద ! కృష్ణేశ్వరుని సతి శ్రీ
రాజరాజేశ్వరి ! నిరంజని !
కరుణ చూపవె ! కనకవల్లీ !
రక్షమాం ! కామాక్షిరో !
భక్తకోటికి క్షణములోనే
ముక్తినిడ ముక్తేశ్వరంబున
ముక్తికాంతగ ! వెల్గుచుంటివి !
రక్షమాం ! కామాక్షిరో !
శివానీ ! శ్రీశైల నాధుని
భామినీ ! బ్రమరాంబ ! మల్లిక
భవానీ ! భవపాశమోచని !
రక్షమాం ! కామాక్షిరో !
జ్ఞానదాశ్రీ కాళహస్తీ
శ్వరుని రాణీ ! ప్రసూనాంబా
జ్ఞాన మిడుమా ! జ్ఞానసింధూ !
రక్షమాం ! కామాక్షిరో !
మాలినీ ! మహిషాసురాంతకి !
మాలినీ ! మాతంగి ! వైభవ
శాలినీ ! శ్యామలా ! భార్గవి !
రక్షమాం ! కామాక్షిరో !
నారదాది మునీంద్ర సన్నుత
శారదా ! సంగీతలోలా
కొరెదనునీ కృపావర్షము
రక్షమాం ! కామాక్షిరో !
ఉమానందేశు భామిని
క్షమాసంపద్గుణ విలాసిని
సమానము నీకెవ్వరమ్మా ?
రక్షమాం ! కామాక్షిరో !
సర్వమంగళ పార్వతీ శ్రీ
చెన్నమల్లేశ్వరుని రాణీ,
పుణ్య గంగలకుర్రు వాసిని !
రక్షమాం ! కామాక్షిరో !
గ్రామగ్రామమునందు నీవే
గ్రామదేవతగాను వెలిసీ
కాచిబ్రోతువు భక్తకోటిని
రక్షమాం ! కామాక్షిరో !
శుభాలిచ్చెడి సుబ్బాలమ్మా !
నూకలిచ్చెడి నూకలమ్మా !
రాజ్యామిచ్చెడి రాజ్యలక్ష్మీ !
రక్షమాం ! కామాక్షిరో !
వానపల్లిని పళ్లాలమ్మవు
పెద్దపురి మరిడెమ్మ మాతవు
విజయనగరిని పైడితల్లివి
రక్షమాం ! కామాక్షిరో !
కొలిచినంతనె కొలువుదీరుచు
పిలిచినంతనె పలుకు తల్లివి
తలతు సతతము తలుపులమ్మా !
రక్షమాం ! కామాక్షిరో !
కన్నులిత్తువు కాళ్ళ నిత్తువు
బుద్ధినిత్తువు బ్రతుకు నిత్తువు
అన్నియును ఆశ్రితుల కిత్తువు
రక్షమాం ! కామాక్షిరో !
శిల్పశైలీ రస సమన్విత
కవనమూ కావ్యమ్ము నీవే
విశ్వసాహితి అరయనీవే
రక్షమాం ! కామాక్షిరో !
భావశోభిత భాషనీవే
అర్థశోభిత పదమునీవే
వర్ణశోభిత కావ్యమీవే
రక్షమాం ! కామాక్షిరో !
శ్రుతిలయాన్విత కీర్త నీవే
రసఃపూరిత కవితనీవే
భక్తిశోభిత భజన నీవే
రక్షమాం ! కామాక్షిరో !
గీతమూ సంగీతమూ నా
గొంతులో సంకీర్త నీవే
గానమూ నా ప్రాణమీవే
రక్షమాం ! కామాక్షిరో !
కలిమినిత్తువు బలిమినిత్తువు
విద్య నిత్తువు వినయమిత్తువు
బుద్ధినిత్తువు భుక్తి నిత్తువు
రక్షమాం ! కామాక్షిరో !
కన్యకకు తగు వరుని యిత్తువు
బ్రహ్మచారికి వధువునిత్తువు
వంధ్యులకు సంతానమిత్తువు
రక్షమాం ! కామాక్షిరో !
రాహుకాలపు దీపములు నీ
ప్రాంగణము వెలిగించు వారీ
కోర్కెలన్నీ తీర్చి బ్రోతువు
రక్షమాం ! కామాక్షిరో !
యోగకర్మ విరక్తి ధ్యానా
జ్ఞాన మార్గముల లవియా ? నా
భక్తి పాయసమారగింపుము !
రక్షమాం ! కామాక్షిరో !
కరుణ ప్రేమలు కలుగలేదా ?
కరగదామది ? కఠిన శిలయా ?
కన్నతల్లివి కాద ? తెలుపుము !
రక్షమాం ! కామాక్షిరో !
వత్పమునకై గోవు రాదా ?
బిడ్డ బోవగ తల్లిరాదా ?
కన్నతల్లీ కరుణ రాదా ?
రక్షమాం ! కామాక్షిరో !
జీవి పరితాపమును చూచీ
జీవు వేదన నాలకించీ
కావుమా కారుణ్య వారిధి !
రక్షమాం ! కామాక్షిరో !
ఎన్ని గ్రహములు ఏకమైనా
ఏమి కీడును నాకుజేయును ?
నీదు కృప నాకెపుడు యుండగ
రక్షమాం ! కామాక్షిరో !
శాంకరివి శ్రీలంక పురిలో
కంచిలో కామాక్షి మాతవు
శృంగళపు ప్రద్యుమ్న పురిలో
రక్షమాం ! కామాక్షిరో !
కంసపురి చాముండి వీవే
ఆలంపురమున జోగులాంబవు
శ్రీగిరీ భ్రమరాంబనీవే
రక్షమాం ! కామాక్షిరో !
కొల్హపురి శ్రీమహాలక్ష్మివి
మాహురంబున ఏకవీరవు
ఉజ్జయిని శ్రీమహాకాళివి
రక్షమాం ! కామాక్షిరో !
పిఠాపుర పురుహుతికీవే
ఓఢ్యాణపు గిరిజనీవే
దక్షపురి మాణిక్యమీవే
రక్షమాం ! కామాక్షిరో !
హరిక్షేత్రపు కామరూపిణి
మాధవీవె ప్రయాగ నగరున
జ్వాలపురి వైష్ణవీదేవీ
రక్షమాం ! కామాక్షిరో !