Literature

Nenu Saitham – Rokkam

సాధారణంగా ఒక ఇంట్లో ఒకరికి వచ్చిన నచ్చిన నైపుణ్యం కానీ ఇష్టం కానీ మరొకరికి ఉండక పోవచ్చును. కానీ అన్న విజయచంద్ర కవి కాగా , ఆ కొమ్మకే పూచిన మరొక కవితా సుమం రొక్కం కామేశ్వరరావు. ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో ప్రోగ్రామ్ డైరెక్టర్. ప్రవృత్తి పరంగా మంచి కవి. శ్రీశ్రీ, జ్వాలాముఖి , శివారెడ్డి లాంటి వారితోనూ, వారి కవిత్వం తోనూ మమేకమై చరించి, చలించి, నేను సైతం అంటూ కవిత్వ సాగరం లోకి దూకిన మరో యువ స్వరం ఈయన. ఎవరి కవిత్వమైనా ఉద్విగ్నత, భావుకత తో మొదలౌతుంది,అది సాగి దిశా నిర్దేశనం కావించుకుని తాత్వికంగా నిలబడితేనే తరతరాలకు మిగులుతుంది. అటువంటి తాత్విక సాంద్రత , పరిణతి ఉన్న వ్యక్తిత్వం కామేశ్వరరావు గారిది. 1997 లో ‘బ్లో-అవుట్’ కవిత్వ సంపుటితో అక్షరారంగేట్రం చేసిన ఈ కవి ‘పదహారు’, 2008 లో ‘అంతర్వీక్షణం’, 2011లో ‘చిదాకాశం’, 2011 లో ‘ జ్ఞానామృతం (ప్రవచనాలు పుస్తక రూపం లోనూ, ఆడియో, సీడీ గా), 2017 లో ‘క్షతగాత్ర’ ప్రచురించారు. వృత్తిపరంగా కీ.శే. వినుకొండ నాగరాజు ‘ఊబిలో దున్న’ నవల ని నాటికగా రూపొందించినందుకు ‘ఉత్తమ దర్శకునిగా’ ఆకాశవాణి వార్షిక అవార్డ్, శ్రీమతి వి. ప్రతిమ రచించిన ‘గంగ జాతర’ కథని నాటికగా రూపొందించినందుకు 2014 లో జాతీయ స్థాయి ‘ఉత్తమ దర్శకునిగా’ ఆకాశవాణి అవార్డ్ అందుకున్నారు.

నిరంతర పాఠనాసక్తి , వేదాంత గ్రంధాలు, తాత్విక గ్రంధాలూ చదివి వాటిని ఆకళింపు చేసుకుని సామాన్యులకి అర్ధమయ్యే రీతిలో వివరించడం ఈయన ప్రవచనం లోని మాధుర్యం.

వామపక్ష భావజాలం తో మొదలైన కవిత్వం విశ్వశాంతి కోరుకునే తాత్వికత కు ఈయన పెట్టింది పేరు.

స్వభావ సిద్ధంగా స్నేహశీలి అయిన కామేశ్వర రావు గారు ప్రస్తుతం అనంతపూర్ ఆకాశవాణి కేంద్రం లో ఉన్నారు.

ఇటీవల ఆయన పుస్తకం ‘క్షతగాత్ర’ ఆవిష్కరించబడింది. కవి తాను మొదలైన ఆ భావజాలాన్ని ఎంత ఉద్విగ్నంగా అవిష్కరించారో చూద్దాం ఈ కవితలో :

తిరుగుబాటు

ప్రతీది/చిన్నగానే మొదలుతుంది/చిరుగాలిలా వీచి/సుడిగాలిలా మారుతుంది/ ఉత్తరం నుండి దక్షిణానికి/తూర్పు నుండి పడమరకు/సర్వే సర్వత్రా వ్యాపిస్తుంది/ దంతెవాడ/బీజపూర్/సుకుమా/ప్రాంతం ఏదైనా/అణచివేతలకి /ఆధిపత్య భావజాలానికి /వ్యతిరేకంగా /అలజడి రేగుతుంది/నిరసన బావుటా/ రెపరెపలాడుతుంది/గ్రామాలు తగలబడుతున్నప్పుడు/అరణ్యాల్ని/అద్దెకిస్తున్నప్పుడు/దండకారణ్యంపై/దండయాత్ర మొదలైనప్పుడు/సంక్షేమం/సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు/దురాచారాలు/ఆచారాలుగా/మారిపోతున్నప్పుడు/అడవి/నీరు/ఖనిజం పై/పెట్టడాన్ని/ప్రశ్నించరా?/తిరగబడరా?.

అమాయక గ్రామీణుల, ఆదివాసుల సర్వ సంపదలను దోచుకున్నప్పుడు వారు తిరగబడతారనే హెచ్చరిక ఉంది ఈ కవితలో. ఏమీ తెలియని వారిని దోచుకుంటున్నప్పుడు వారు ప్రశ్నిస్తారు, తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తారు అనే సూచన చేస్తాడు కవి, వారిలో స్ఫూర్తి రగిలిస్తాడు.

ఆహారమన్నది వారి వారి అలవాట్ల పై వారికి అందే వనరుల పైన ఆధారితమై ఉంటుంది. కవుల కలాలని మూగ చేస్తూ , ప్రజల ఆహారాన్ని కూడా నిర్దేశించే, ఆక్షేపించే, ఆంక్షలు విధించే ప్రభుతను ప్రశ్నిస్తున్నాడు సూటిగా ఈకవి ఇలా :

నల్లరంగు

ఏ చిత్రం చూడాలో/ఏ పాట పాడాలో/ఏ తిండి తినాలో/మీరా మాకు నిర్దేశించేది?/మీరు గీసిన గీతాల్లోపల/మీ రెక్కల వెనుక జీవించలేమ్/మా కళాలపై/గళాలపై/నిషేధాన్ని భరించలేం/చాలు-చాలు /ఈ ఉన్మాద వీరంగాలు/స్వేచ్చని హరిస్తూ/ప్రజాస్వామ్యాన్ని /పరిహసిస్తూ సాగే మీరు/ఏ గొప్ప సాంస్కృతిక /వారసత్వానికి వారసులు?/భాష మార్చుకోరు/పద్ధతి నేర్చుకోరు/ఇది ఆత్మ నాశనం/దేశ వినాశనం.

నిలువెత్తు నిరసన స్వరమై పలుకుతున్నాడు కవి ఈ కవితలో. ఆవేదన, ఆగ్రహ ప్రకటన చేస్తున్నాడు.

ప్రజలను మేల్కొలిపే ఈ కవి చేస్తున్న శంఖారావం ఢంకా ధ్వానం ఈ క్షత గాత్రలో ఇంకా ప్రస్ఫుటంగా అగుపిస్తుంది :

క్షతగాత్ర

ఎన్నాళ్ళైందో/వరుణుడు కరుణించి/నేల దీవించి/వలస పోయే వేళయింది/ప్రకృతి/ప్రభుత్వం/అందరూ శత్రువులే/ఎలా బతకమంటారు పల్లెల్లో/దమ్మిడీ ఆదాయం లేని/దళారీ రాజ్యంలో/ ఎరువులు/ విత్తనాలు/అప్పులు/వడ్డీలు/వీటి చుట్టే బతుకులు/పంట పండదు/ఇంత నిప్పు మండదు/పెట్టుబడి బారాణా/ఆదాయం చారాణా/చక్రవడ్డీల చక్రబంధం/పొలం పద్మ వ్యూహం లో/అభిమాన్యులం మేం/….అంటూ సాగే ఈ కవితలోని ఆర్తి పాఠకుల్ని కదిలిస్తుంది. చివరిగా అంటాడిలా :

‘భూమాత ఒడిలో/భూమి పుత్రుల మృత్యు ఘోష/భీమా లేదు/బతుక్కి ధీమా లేదు/గూగుల్ మ్యాప్ ల /పల్లెల విధ్వంస చిత్రం’.

మొన్ననే జరిగిన ప్రభుత్వ వ్యవసాయ సాంకేతికత కార్యక్రమంలో కూడా భూమి పుత్రుల గురించి ఏమీ ఆలోచించని ప్రభుత్వం వ్యవసాయాన్ని వ్యాపారం చేయాలనే ప్రపంచ కోటీశ్వరుడి మాటలను గీతా వాక్యంగా ఆలకించడం హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎన్ని కంప్యూటర్లూ, ఎంత సాంకేతికత వచ్చినా ఒక్క బియ్యం గింజ పండించలేవని, ఆ బియ్యం ఆ నేలలో ఆ రైతు చేతుల్లోనే పండాలనీ అటువంటి అన్నదాతను మనం బ్రతికించుకున్నప్పుడు మనకి నాలుగు వేళ్ళు నోట్లోకి పోతాయని ఎప్పటికి అర్ధం అవుతుందో ఈ మనుషులకి అని ఆవేదన చెందుతున్నాడు కవి. కామేశ్వర రావులోని ఈ ఉద్విగ్నత, ఆవేదన తన కవిత్వాన్ని చదివి ఆలోచింపజేసేలా చేస్తాయి, అతని తాత్వికత మనకి మనోశాంతిని కలిగిస్తుంది. అచట పుట్టిన … అన్నట్టు బరంపురం వికాసం , ఖుర్దా రోడ్ కవితా సంఘం నుండి ఆవిర్భవించి ఇంతింతై నేడు తెలుగు సాహిత్యం గర్వించే కవి రొక్కం కామేశ్వర రావు అనడం లో అతిశయోక్తి లేదు. అతను ఇంకా మంచి చిక్కని కవిత్వాన్ని అందించాలని సాహిత్య సోదరిగా ఆశిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *