Cultural, News

AnandaVihari – 07_007

అలరించిన “మాయాబజార్”

శశిరేఖ, అభిమన్యుల ఆటపాటలు, ఘటోత్కచుడి ఆకతాయితనం, చిన్నమయ, లంబు జంబుల మధ్య హాస్య సంభాషణలు, లక్ష్మణ కుమారుడి అల్లరి.. “బయబజార్” అనగానే ఈ సన్నివేశాలన్నీ గుర్తొచ్చి మనసును పులకింపజేస్తాయి.
1957లో విడుదలై నేటికీ ఆబాలగోపాలన్ని అబ్బురపరుస్తున్న “మాయాబజార్” చిత్రంలోని మధుర ఘట్టాలను “మద్రాసు మువ్వలు” మహిళా బృందం కళ్ళముందుంచింది. అమరజీవి స్మారక సమితి శనివారం ఏర్పాటు చేసిన “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో “మాయాబజార్” 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “మద్రాసు మువ్వలు” ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పించింది.

క్రొవ్విడి రమాదేవి (కృష్ణుడు, మాయా కృష్ణుడు),   సరస్వతి (శశిరేఖ, లక్ష్మణ కుమారుడు),  తిరుమల ఆముక్తమాల్యద (శర్మ) రేవతి, వసంతలక్ష్మి (బలరాముడు, మాయా శశిరేఖ) శశిరేఖ, శాస్త్రి, దారుకుడు (లేళ్ళపల్లి శ్రీదేవి)నెల్లుట్ల లీల (సారథి) పత్రి అనూరాధ (లంబు) వసంత (జంబు, బలరాముడు), వసుంధర (ఘటోత్కచుడు), శ్రీలక్ష్మి (శకుని), జోశ్యుల ఉమ (పురోహితుడు), భానుమతి (చిన్నమయ, అభిమన్యుడు), భారతి (హిడింబి), ఉమ (సుభద్ర) ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

చిత్ర నిర్మాణ విశేషాలను ముళ్ళపూడి శ్రీదేవి, బాలాంత్రపు లావణ్య వినిపించి అలరించారు. మరాఠీ, గుజరాతీ భాషల్లో ప్రసిద్ధి చెందిన నాటకం ఆధారంగా అనేక చలన చిత్రాలు విజయా వారు తీసి విజయవంతం చేసిన “మాయాబజార్” (1957) చలన చిత్రం

బాల శశిరేఖను చెలికత్తెలు ఆటపట్టించడంతో మొదలుపెట్టి నవరసాలు ఉట్టిపడే అనేక సన్నివేశాలను నటించి పండించారు. అనూరాధ సన్నివేశాలను వివరించారు.

అల్లిబిల్లి అమ్మాయికి (పత్రి అనూరాధ, ఎస్పీ వసంతలక్ష్మి) నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహిరిలో (వసంత, వసుంధర), భళి భళి (ఉమ) తదితర పాటలు అలరించాయి.
వసుంధర ఘటోత్కచుని పాత్రను పోషిస్తూ వినిపించిన పద్యం అలరించింది. చిన్నమయ, లంబు జంబుల మధ్య హాస్య సంభాషణలు సభను నవ్వించాయి. కంచుకంఠంతో సుభద్ర పాత్రధారి ఉమ వినిపించిన పద్యం, “ఆహా నా పెళ్ళి అంట” పాట ప్రేక్షకుల మన్ననలందుకున్నాయి. “ఆహా నా పెళ్ళంట”, “వివాహ భోజనంబు” తదితర పాటలకు ప్రేక్షకులు కూడా గొంతు కలిపారు.

కల్పన గుప్తా కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరజీవి స్మారక సమితి కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సకల కళా వల్లభుడు బాలమురళి 

ఎస్. జానకి

 

అనేక అంశాలలో బాల మురళి ది అందెవేసిన చేయి అని ప్రముఖ సినీ గాయని ఎస్ జానకి కొనియాడారు.  ఇటీవల జరిగిన బాలమురళి మొదటి వర్ధంతిని పురస్కరించుకొని శర్వాణి సంగీత సభా ట్రస్టు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 03 వ తేదీ ఆదివారం సాయింత్రం టీనగర్ ఇన్ఫోసిస్ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ అతిథిగా హాజరైన జానకి మాట్లాడుతూ…. ఆయన సంగీత దర్శకత్వంలో పాడిన పాటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పురస్కారాలను అందుకున్నానని గుర్తు చేశారు. తనను ఆయన శిష్యురాలిగా భావించేవారని, అది తనకు గౌరవమని పేర్కొన్నారు. ఆయన మరణానికి నెల ముందు కలిశానని, తనను గుర్తుపట్టారని వెల్లడించారు. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నామని, హైదరాబాద్ వచ్చి కచేరి చేస్తానని ఆయన తనకు మాట ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. “వసంత గాలికి వలపులు రేగ”పాటను ప్రముఖ గాయకుడు నీహాల్ తో కలిసి మధురంగా వినిపించారు. ఒక కన్నడ పాట, “తోడు” అనే చిత్రంలో ఆయన సంగీతంలో తను పాడిన పాట పల్లవులను పాడి సభను ముగ్ధులను చేశారు. తను హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చింది కార్యక్రమ నిర్వాహకురాలు వసంత కోసమేనని వెల్లడించారు. 

వి ఏకె రంగారావు మాట్లాడుతూ..తనకు నాలుగేళ్ళ వయసు నుంచీ బాలమురళీకృష్ణ తెలుసునని, తనకన్నా వయసులో కొంచెమే పెద్ద అయిన ఆయన గాత్రం మొదటిసారి విని తను, తన బాలలు ముగ్ధులయ్యామని అన్నారు. కొత్త సొబగులను జోడించి ఒక రాగ స్వరూపాన్ని నిర్ణయించే అధికారం ఆయనకు ఉండేదని ప్రశంసించారు. తన విమర్శను మంచి మనసుతో స్వీకరించేవారని గుర్తు చేసుకున్నారు. అన్నమాచార్య కీర్తన మొట్టమొదటి ఎల్పీ రికార్డు ఆయన గాత్రంలోనే వెలువడిందని గుర్తు చేశారు. ఆయన నృత్యం కోసమని ప్రత్యేకంగా తిల్లానాలు రూపొందించకపోయినా అవన్నీ ఆ ప్రక్రియకు అద్భుతంగా అమిరాయని వ్యాఖ్యానించారు. 

సంగీత ప్రపంచానికి ఒక యుగ పురుషుడు బాలమురళి అని ప్రముఖ సంగీత విద్వాంసులు  తాడేపల్లి లోకనాథ శర్మ వెల్లడించారు. ఆయన తనను చిన్నప్పుడు ఎత్తుకునేవారంటూ ఒక మధురానుభూతిని పంచుకున్నారు. మాధుర్య ప్రధానంగా, సాహిత్య భావంతో పాడడంలో తనతో సహా అనేకమందికి ఆయన మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. 1978లో వాసుదేవ్ అనే అభిమాని తన మీద  బాలమురళి మీద ఒక పాట రాసి ఆయననే ట్యూన్ చేయమనగా, తన మీద రాసిన పాటకు తనే సంగీతాన్ని అందించడం సమంజసం కాదని పేర్కొని ఆ పనికి తన పేరును సూచించారని వివరించారు. అప్పుడు ఆయన స్వహస్తాలతో రాసిన లేఖను చదివి వినిపించారు. 

ముఖ్య అతిథిగా హాజరైన కె. రాధాకృష్ణ గణపతి (ప్రిసైడింగ్ ఆఫీసర్, డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్ 3, తమిళనాడు) మాట్లాడుతూ.. బాలమురళి అనగానే నారదుడి వేషంలో ఆయన పాడిన పాటలే గుర్తొస్తాయని అన్నారు. 

బాలమురళి పాడితే మనసు ఊయలలూగేదని ప్రసిద్ధ సినీ గీత రచయిత భువనచంద్ర అన్నారు. కె. రామలక్ష్మి రాసిన “తరాలు” అనే టీవీ ధారావాహిక కోసం తను రాసిన గీతానికి ఆయన సంగీతాన్ని కూర్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

బాలమురళి రెండవ కుమారుడు డా. సుధాకర్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. 

ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ పంపించిన సందేశాన్ని కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీమతి రాంనాథ్ చదివి వినిపించారు. 

బాలమురళీకృష్ణ రూపొందించిన అన్ని కీర్తనలూ వచ్చిన వాసుదేవ్, సంస్థ వ్యవస్థాపకురాలు వసంత, నిర్వాహకులు సూరి శ్రీవిలాస్, కమిటీ సభ్యులు,  నగర ప్రముఖులు కార్యక్రమానికి  హాజరయ్యారు. 

శివంగి కృష్ణకుమార్, నేహా వేణుగోపాల్ లు ఆలపించిన బాలమురళీకృష్ణ కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. 

సభా కార్యక్రమం అనంతరం బాలమురళీకృష్ణ శిష్యులు కృష్ణ కుమార్, ఆయన శ్రీమతి బిన్నీ కృష్ణ కుమార్ లు బాలమురళి కీర్తనలతో చేసిన  గాత్ర కచేరి రసరమ్యంగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *